కుర్చీ వేయరు, నిధులు ఇవ్వరు - దళిత సర్పంచ్‌కు అవమానం - అధికారులపై ఫిర్యాదు చేసిన దళిత సర్పంచ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 8:44 PM IST
|Updated : Dec 8, 2023, 6:21 AM IST
Sarpanch Protested by Sitting on the Floor: దళిత సర్పంచ్‌నని అధికారులు తన పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బూదవాడ సర్పంచ్ హరిబాబు ఆరోపించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయ కార్యాలయంలో నేలపై కూర్చొని నిరసన తెలిపాడు. ప్రజా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తే అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బూదవాడలో గత ఎన్నికల్లో హరిబాబు అనే దళిత వ్యక్తి సర్పంచ్‌గా గెలిచాడు. అయితే, తాను సర్పంచ్ అయింది మెుదలు, ఇప్పటివరకూ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని హరిబాబు ఆరోపించారు. సచివాలయ భవనాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా, ఇంతవరకు తన గదిలో కుర్చీని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపాడు. దళితుడిని అనే కారణంతోనే కనీసం కుర్చీని కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వైసీపీ నుంచి వస్తున్న అరకొర నిధులతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నా, పంచాయతీ సిబ్బంది మాత్రం తనకు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాధికారుల తీరుకు నిరసనగా, హరిబాబు తన గదిలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. మండలంలో జరిగే సమావేశాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను దళితుడిని కనుకే ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరిబాబు తెలిపాడు.