'హామీలిచ్చి ఆస్తులు తాకట్టు పెట్టి'- సర్పంచ్ దంపతుల భిక్షాటన - వైసీపీ నేతల కామెంట్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 12:56 PM IST
Sarpanch Begging For Village Development: తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పెద్దపీట వేస్తుందని, వైసీపీ నేతలు మైక్‌ల ముందు ఊదర గొడుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తమ గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదంటూ గ్రామ సర్పంచ్‌లు రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేస్తున్న పరిస్థితి తరచూ చూస్తునే ఉన్నాం. తాజాగా... చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం.. గుడుపల్లె మండలం శెట్టిపల్లె గ్రామ పంచాయతీలో.. సర్పంచ్ రీటా, ఎల్లప్ప దంపతులు నిధుల కోసం భిక్షాటన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ తరఫున గెలవటంతో... అభివృద్ధి పనుల కొరత ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం సర్పంచ్‌లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. ఇలా ప్రజల నుంచి భిక్షాటన చేయాల్సి వస్తుందని సర్పంచ్ దంపతులు వాపోయారు. తాము గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, హామీ ఇచ్చామని గ్రామాభివృద్ధికి నిధుల కొరత అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాలైన తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు... తదితర అవసరాలకు డబ్బులు లేవని తెలిపారు. ఇప్పటికే ఆస్తులను తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. చివరి ప్రయత్నంగా ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్నామని పేర్కొన్నారు. జగన్ తన కోసం పంచాయితీ వ్యవ్యస్థను నిర్వీర్యం చేశారని సర్పంచ్ దంపతులు ఆరోపించారు.