స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు - సంక్రాంతి సంబరాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 5:19 PM IST
Sankranthi Celebrations in Swarna Bharat Trust: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో ఏర్పాటు చేసిన సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ప్రతి సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. స్వామి వివేకానంద బోధనలు అసాధారణమైనవని, ఆయన జయంతి రోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గొప్ప విషయమని వివరించారు. యువత వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రజలందరి ఆదాయాన్ని పెంచే విధంగా, విద్య, వైద్యాన్ని పంచేలా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. సంక్రాంతి సంబరాలు సొంత ఊరు జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉన్నాయని, ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ముగ్గుల ద్వారా మహిళల్లో ఓర్పు, నేర్పుకు గుర్తు సంక్రాంతి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.