సంగం డెయిరీ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ అరెస్ట్ - కుటుంబ సభ్యుల ఆందోళన - Sangam Dairy Director srinivasa rao Arrested
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 19, 2023, 10:54 AM IST
Sangam Dairy Director Arrested: ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి విషయంలో గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు..పెదనందిపాడు డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున శ్రీనివాసరావుతో సహా మరో ఇద్దరు ఉద్యోగులు రాజ్ కుమార్, నేలటూరి రవిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. చేబ్రోలు పోలీసులు ఇప్పటివరకు 15 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను 14వ ముద్దాయిగా చేర్చారు.
సంగం డెయిరీ డైరెక్టర్ శ్రీనివాస్ అరెస్టుపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావుకు ఇటీవల గుండె సంబంధిత ఆపరేషన్ జరిగిందని.. కనీసం మందులు వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా బలవంతంగా స్టేషన్కు తరలించారని.. ఆయన భార్య శైలజ అవేదన వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురి పేర్లు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పేర్లు లేకపోవడం గమనార్హం
అరెస్టుపై శ్రీనివాస్ భార్య శైలజ మాట్లాడూతూ.. ఉదయాన్నే సివిల్ డ్రెస్‌లో కొందరు వచ్చారని.. విచారణకు తీసుకెళ్తున్నామన్నారని చెప్పారు. నోటీసు లేకుండా విచారణ ఏంటని అడిగితే జవాబు చెప్పలేదని.. గుండె ఆపరేషన్ చేశారని చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. ధూళిపాళ్ల అనుచరుడు కావడమే వల్ల తన భర్తపై కక్ష కట్టారని.. తన భర్తకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని ఆమె మండిపడ్డారు.