Sajjala on Jagan అకస్మాత్తుగా జగన్ పేరును సీబీఐ తెరపైకి తేవడం.. చిల్లర చేష్ట: సజ్జల - సీబీఐ పిటిషన్లో సీఎం జగన్ పేరు
Sajjala Reacts on CM Jagan Name in CBI Petition: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న వాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరుగుతున్న తీరుపై ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న వాదనల్లో ఉన్న ఫలంగా సీబీఐ కౌంటర్ వేసిందని.. అందులో సీఎంవైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుచేర్చడం చిల్లర చేష్టలుగా భావిస్తున్నామన్నారు. ఏదో సంచలనం సృష్టించేందుకు ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడమే తప్ప,, దాంట్లో నిజం ఏమాత్రం లేదన్నారు.
సెన్సేషనల్ ఎందుకు చేయాలనుకుంటుందో సీబీఐ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. సీబీఐ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సంబంధం లేని వారి పేరును ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. సంబంధం లేని కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలనుకోవడం సబబు కాదని వ్యాఖ్యానించారు. సీబీఐ చేస్తున్న వ్యవహారాలు ముందస్తుగా వాళ్లకు ఎలా తెలుస్తున్నాయో అర్థం కావడం లేదన్న ఆయన.. ఈ నెట్ వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారో బయటకు రావాల్సి ఉందన్నారు.