అంగన్వాడీల సమ్మె వెనక రాజకీయ కోణం - జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు: సజ్జల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 10:01 PM IST
Sajjala Ramakrishna Reddy Comments: అంగన్వాడీల సమ్మె వెనక రాజకీయ కోణం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ విషయం ఆయా గ్రూపుల్లో అంగన్వాడీ సంఘ నేతల ఆడియో సందేశాల బట్టి బహిర్గతమైందన్నారు. ప్రభుత్వం వల్ల అయిన డిమాండ్లన్నీ పరిష్కరించామని ఆందోళనలు విరమించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో అంగన్వాడీల జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో వేతనాలు పెంచుతామని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్వాడీల విధులు అత్యవసరం కనుకే ఎస్మా (ESMA) చట్టాన్ని ప్రయోగించామని అన్నారు.
పట్టుదలకు పోవద్దని అంగన్వాడీలు, పారిశుద్ధ్య వర్కర్లను కోరుతున్నామని తెలిపారు. తాము ప్రత్యామ్నాయం చూసుకుంటే అంగన్వాడీలు నష్టపోతారని హెచ్చరించారు. అంగన్వాడీలపై దురుసుగా వెళ్లవద్దని పోలీసులకు చెప్పామన్న సజ్జల, మున్సిపల్ కార్మికులతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ కార్మికులను ఎస్మా పరిధిలోకి తెచ్చే యోచన లేదని వెల్లడించారు.
అదే విధంగా అభ్యర్థుల మార్పుపై సైతం సజ్జల స్పందించారు. ఎన్ని అవసరమైతే అన్ని స్థానాల్లో అభ్యర్థులను మారుస్తామని అన్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు, వారు ఎన్నికల్లో ఎందుకు పని చేస్తారని ప్రశ్నించారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వాడుకునే అవకాశం ఉండదని తెలిపారు.