సమ్మెలో అంగన్వాడీలు - 'సచివాలయ ఉద్యోగులకు ఆటవిడుపు' - ఏపీలో అంగన్వాడీ ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 5:18 PM IST
Sachivalayam Employees Playing Games In Anganwadi Centre:గాడిద చేయాల్సిన పని గాడిద, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలని ఓ లోకోక్తి ఉంది. కానీ, వైసీపీ ప్రభుత్వంలో అలాంటి పట్టింపులు ఏమి కనబడవు. అంగన్వాడీల సమ్మెను అణచివేయడానికి ప్రయత్నాలు చేపట్టింది. అందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను అధికారుల సమక్షంలో పగలగొట్టి మరీ, సచివాలయ ఉద్యోగులను విధులను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది.
అందుకోసం అంగన్వాడీలకు బదులుగా ఆయా గ్రామాల్లోని సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో సచివాలయ సిబ్బంది అంగన్వాడీలుగా మారారు. ఆయా కేంద్రాలు మూసినా సరే అధికారుల సమక్షంలో తాళాలు బద్దలు కొట్టి మరీ, అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్లారు. కానీ, అంగన్వాడీలో పర్యవేక్షకులు ఉన్నారని తెలిసినా తల్లిదండ్రులు మాత్రం అంగన్వాడీ కేంద్రాలకు తమ పిల్లల్ని పంపించలేదు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పాఠాలు నేర్పాల్సింది పోయి, ఆ చిన్నారులకు ఆట వస్తువులుగా ఉన్న బ్యాటు, బంతితో ఒకరు బోర్డుపై బంతితో కొడుతూ క్రికెట్ ఆటను ఆస్వాదిస్తున్నాడు. మరోవైపు నెల నెలా చిన్నారుల బరువు చూసే ఉయ్యాలలో ఊగుతూ సేదతీరారు. ఈ వికృత చర్యను సచివాలయ ఉద్యోగుల సమక్షంలోనే వీడియో తీస్తూ ఆనందం పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
మరోవైపు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లంతా సమ్మెలో ఉండడంతో, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలను అధికారులు తెరిచారు. తాళాలు వేసిన అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తెరిచి స్వాధీనం చేసుకున్నారు. చాలా కేంద్రాల్లో తాళాలు బద్దలు కొట్టి మరి ఈ సిబ్బంది స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. సచివాలయం సిబ్బందికి పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పజెప్పారు. మార్కాపురంలో అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు కరువయ్యారు. అత్యధిక పాఠశాలలకు పిల్లలు రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కేవలం సచివాలయం సిబ్బంది మాత్రమే అంగన్వాడీ కేంద్రల్లో ఉన్నారు.