ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్ జవహర్‌రెడ్డికి ఎన్ఎంయూఏ నేతల వినతి - ఎస్ఆర్బీఎస్ స్కీం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 10:26 PM IST
RTC NMU memorandum to CS Jawahar Reddy: ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్.. ఎన్ ఎంయూఎ రాష్ట్రప్రభుత్వాన్ని మరోసారి కోరింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన సంఘం నేతలు.. మూడు పేజీల మెమోరాండంను అందించారు. సీఎస్‌ను కలిసిన ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు, నేతలు విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అందులో వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న 11 ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎన్ ఎంయూ నేతలు కోరారు. ఆర్టీసీ ఉద్యోగులందకీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు నియమితులైన ఉద్యోగులకు పాత సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని మెమోరాండంలో కోరారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన సవరణ బకాయిలు, వెంటనే చెల్లించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఉన్నట్లుగా అలవెన్సులను మంజూరు చేయాలని ఎన్ఎంయూ నేతలు సీఎస్ ను కోరారు. విలీనం అనంతరం రద్దు చేసిన ఎస్ ఆర్ బీఎస్ స్కీమును పునరుద్ధరించాలని, రిటైర్డ్, చనిపోయిన సిబ్బందికి ఇంతవరకు గ్రాడ్యుటీ, శాలరీ సెటిల్ మెంట్ చేయలేదన్నారు. ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే చెల్లించాలని సీఎస్ ను కోరారు. ఆర్టీసీ ఉద్యోగులపై వేస్తోన్న తీవ్ర శిక్షలు అమలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. గతంలో ఉన్నట్లుగా అపరిమిత వైద్య సదుపాయం కల్పించాలని సీఎస్ ను కోరారు. ప్రస్తుతం బస్సుల పరిస్థితి దృష్ట్యా 3 వేల కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు అనుమతించాలన్న ఎన్ ఎంయూ నేతలు.. సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.