RTC Contract Employees Agitation In Vijayawada: హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు: ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు - ఆప్కాస్
RTC Contract Employees Agitation In Vijayawada: ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టర్ ద్వారా కాకుండా.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి క్రమబద్దీకరించాలన్నారు. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఒప్పంద ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఒప్పంద ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చి ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై కాంట్రాక్టర్ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తగ్గించి.. ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ వంటి సదుపాయాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధుల నుంచి తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని.. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.