గతుకుల రోడ్డు ప్రయాణం ఆపై ఫిట్నెస్ అంతంతే - పంటకాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడ్డ బస్సు - AP accident news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 5:34 PM IST
|Updated : Dec 17, 2023, 10:07 PM IST
RTC Bus Rammed Into Crop Canal:ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెెళ్తే జిల్లాలోని చల్లపల్లి మండలం మేకావారిపాలెం వద్ద అవనిగడ్డ నుంచి విజయవాడకు బయలు దేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి రహదారిపై ఏర్పడ్డ గుంతలు, బస్సు మరమ్మత్తులకు నోచుకోవడమే కారణమని ప్రయాణికులు వాపోతున్నారు.
విషయం తెలుసుకున్న చల్లపల్లి సీఐ నాగ ప్రసాద్, ఎస్ఐ చినబాబులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బస్సు స్థితిగతులపై ప్రతి రెండు నెలలకొకసారి పరీక్షిస్తున్నామంటూ డిపో మేనేజరర్ సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.