RTC Bus Skidded: ఎన్టీఆర్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు సేఫ్ - ఎన్టీఆర్ జిల్లా రోడ్డు ప్రమాదం
RTC Bus Lost Control and Skidded to Side of Road: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు జారిపోయింది. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు - శివాపురం మధ్య ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును నిలిపేశారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు జేసీపీ సాయంతో బస్సును బయటకు తీశారు. సుమారు గంటపాటు బస్సు నిలిచిపోవటంతో ఆ ప్రాంతంలో వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ రోడ్డులో శివపురం తాగునీటి పైపు లైను పనులు కొద్దిరోజుల క్రితం చేపట్టారు. దీనిలో భాగంగా రోడ్డు అంచుల్లో పైప్ లైన్ కోసం తవ్విన మట్టిని తారు రోడ్డు పైనే వేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆ మట్టి రోడ్డంతా పడిపోయిందని, దానివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు దీనిపై స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.