ఎదురుగా వస్తున్న వాహానాన్ని తప్పించబోయి, కాలువలోకి దూసుకెళ్లిన బస్సు! పల్నాడు జిల్లాలో ఘటన - ఏపీ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 7:52 PM IST
RTC Bus Accident in Palnadu District: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుంటూరుకు వెళ్లుతుండగా.. సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి మేజర్ కాలువ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాలువ వంతెన వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు.. రోడ్డు మీద నుంచి కాలువ వైపు దూసుకుపోయింది. కాలువలో పడిపోకుండా వంతెన మధ్యలోనే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
People Facing Problems with Damaged Roads in AP: దీంతో బస్సులోని సుమారు 40 ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు వంతెనపై ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడుగుకో గొయ్యి.. గజానికో గుంతలతో రహదారులు అధ్వానంగా ఉండటంవల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు అంటున్నారు. రహదారుల మరమ్మతులను వైసీపీ సర్కారు పట్టించుకోకపోవటం వల్లనే తరచూ ఇలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.