రోజంతా కారులో తిరుగుతూ రెక్కీ - రాత్రయితే చాలు ఇళ్లు గుల్లే! 'అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్' - చోరీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 3:27 PM IST
Robbery In Locked Houses: బ్రతుకు దెరువు కోసం ఊరుకాని ఊరులో జీవిస్తూ, ఫ్యామిలీకి, ఊరుకు దూరంగా ఉంటూ రూపాయిరూపాయి కూడబెట్టుకుని, పండుగ వస్తే ఫ్యామిలీతో సంతోషంగా గడపడానికి బంధువుల ఇంటికి, సొంతింటికి వెళ్తుంటారు. సరిగ్గా ఇదే అదునుగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆదివారం కడప-బెంగళూరు జాతీయ రహదారిపై అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్థుల నుంచి రూ.33 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో అంతర్రాష్ట్ర దొంగలున్నారని పోలీసులు వెల్లడించారు. కర్ణాటక చిక్బల్లాపూర్ వర్లకుంటకు చెందిన కృష్ణప్ప రాజేష్, చిత్తూరు పలమనేరు సాయినగర్‌కు చెందిన హేమగిరి, మదనపల్లి వాల్మికి నగర్‌కు చెందిన ఆవుల ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. వీరు కారులో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఊరు వెళ్లేవారు ముందస్తుగా సమాచారం ఇస్తే ఇంటికి తగిన రక్షణ కల్పిస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు.