Road Robbery in Anakapalli District: సచివాలయ సిబ్బంది కళ్లలో కారం కొట్టి.. రూ.14 లక్షలు అపహరణ - Anakapalli District Road Robbery News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 9:59 PM IST
|Updated : Sep 1, 2023, 6:34 AM IST
Road Robbery In Anakapalli District: పింఛన్ డబ్బులు తీసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తున్న గ్రామ సచివాలయ సిబ్బంది కళ్లలో కారం కొట్టి.. సుమారు రూ.14 లక్షల నగదును దోచుకెళ్లిన సంఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కపల్లి మండలం జానకియ్యపేట గ్రామంలో పెన్షన్ నగదును పంచేందుకు సచివాలయ సిబ్బంది స్కూటీపై నగదు తీసుకుని వెళ్తుండగా.. దోపిడీ దొంగలు దారి కాచి, నగదును దోచుకెళ్లారు. హెటెరో మందుల పరిశ్రమకు సంబంధించిన సెజ్ రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్కూటీపై వెళ్తున్న సచివాలయ సిబ్బంది కళ్లలో కారం కొట్టి, స్కూటీ డిక్కీలో ఉన్న రూ.14లక్షల నగదును ఇద్దరు దుండగులు అపహరించినట్లు సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, నర్సీపట్నం ఏఎస్పీకి సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న ఏఎస్పీ నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. అయితే, గతంలో ఇదే తరహా సంఘటన గుల్లిపాడు వెళ్లే రహదారిలో జరిగిందని, ఈరోజు అలాంటి ఘటనే జరగడంతో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.