కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఊడి పడిన స్లాబ్ పెచ్చులు - తప్పిన పెను ప్రమాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 8:29 PM IST
RIMS Hospital Slab Fell Down in Kadapa District : కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడంటంతో రోగులు భయాందోళనకు లోనయ్యారు. 2005లో ఆస్పత్రిని నిర్మించారని.. ఇప్పటి వరకు ఎలాంటి పునర్నిర్మాణ పనులు చేపట్టలేదని రోగులు తెలిపారు. కుటుంబ నియంత్రణ వార్డు పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడి పడ్డాయని.. ఆ సమయానికి వార్డులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రోగులు పేర్కొన్నారు. ఇనుప చువ్వలు కనిపించే విధంగా స్లాబ్ పెచ్చులు ఊడిపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని రోగులు కోరుతున్నారు.
RIMS Hospital Repare :కుటుంబ నియంత్రణ వార్డు పైకప్పు నాసిరకంగా ఉందని.. ఎప్పుడైనా కూలుతుందనే ఉద్దేశంతోనే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వారం రోజులు కిందటనే ఆ విభాగాన్ని ఖాళీ చేసి.. వేరే చోటికి రోగులను పంపించారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి కింద పడడంతో అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అదే ఆవరణంలో మరో విభాగంలో కూడా పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయని సిబ్బంది తెలిపారు. కానీ అక్కడ పేషెంట్లు ఉన్నారు. ఆస్పత్రిలో ఉండాలంటే ఆందోళనగా ఉందని రోగులు అంటున్నారు.