Restrictions during the CM visit in flood areas సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనలోనూ.. కొనసాగిన ఆంక్షల పర్వం! అవస్థలు పడ్డ జనం! - CM Jagan visits news
Restrictions during the CM visit in flood areas: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ, రేపు (రెండు రోజులు) గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మొదటి రోజు (సోమవారం) పర్యటన అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్టలో జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో కోతుల గుట్టకు చేరుకోగా.. ఇక్కడి జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
సీఎం పర్యటన.. వాహనాలకు అనుమతి నిరాకరణ..అయితే, సీఎం జగన్ పర్యటన దృష్ట్యా పలు గ్రామాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. చట్టి నుంచి కూనవరం వైపు వెళ్లే వాహనాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చట్టి కూడలి వద్ద బారికేడ్లు పెట్టి, వాహనాల్ని వెనక్కి పంపుతున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం అనుమతించక పోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రేపాక, పంద్రాజుపల్లి మధ్య రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా సీఎం జగన్ ఏ ప్రాంతాల్లో పర్యటించిన.. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు, వాహనాదారులకు, ప్రయాణికులకు ఇక్కట్లు, ఇబ్బందులు తప్పటం లేదు. సీఎం హెలికాప్టర్‌లో వచ్చినా, కాన్యాయ్‌లో వచ్చినా.. పోలీసులు, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం కనబరుస్తూ.. సామాన్య ప్రజలకు తీవ్ర అవస్థలు కల్గిస్తుండడంపై సీఎం జగన్ తీరుపై విమర్శలు తలెత్తుతున్నాయి. మరోవైపు కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వరద బాధితులను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమ ఊరి బాధలను సీఎం జగన్‌తో చెప్పుకుంటామని బతిమాలినా నిరాకరించారు. దీంతో సీతారామపురం నుంచి పొలాల మీదుగా దాదాపు 3.కి.మీ నడిచి సభాస్థలికి చేరుకునేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడిన గొమ్ముగూడెం బాధితులకు మాత్రం అనుమతి లేదంటూ పోలీసులు వెనక్కి పంపేయడంతో.. పోలీసుల వైఖరిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.