ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యేలపై 78 కేసులు: విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు - ఏపీ పెండింగ్ కేసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 5:35 PM IST
Representatives Court Vijayawada: ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 78 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు హైకోర్టుకు తెలిపింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో వేగం పెంచాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఏపీ హైకోర్టు సుమోటోగా విచారణను చేపట్టింది. ఈ కేసులపై ట్రయల్ త్వరగా పూర్తి చేయటానికి అవసరమైన చర్యలను చేపట్టింది. అదనపు వివరాలు ఉంటే తెలపాలని అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలు గత విచారణలో హైకోర్టు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించింది.
చట్టసభల సభ్యులపై నమోదైన కేసులు ప్రజాస్వామ్యంపై పత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని దేశోన్నత న్యాయస్థానం గతంలో వివరించిన విషయం తెలిసిందే. ప్రభావం చూపుతున్నాయని, ఈ కేసులను ప్రాధాన్య క్రమంలో తప్పనిసరిగా విచారించాలని తెలిపింది. విచారణలో వేగంగా తీర్పు వెలువరించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యం సమర్థంగా, ప్రభావశీలంగా పనిచేయడానికి ప్రజాప్రతినిధులపై విశ్వాసం ముఖ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కానీ, న్యాయస్థానాల్లో ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలిస్తే అలాంటి నమ్మకం కలగడం కష్టమని వ్యాఖ్యానించింది.