ఇక మట్టిని కూడా దాచుకోవాలేమో! గద్దల్లా తన్నుకుపోతున్న అక్రమార్కులు - జగనన్న సొంత జిల్లాలో దారుణాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 12:02 PM IST
Red Soil Illegal Mining: అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్లుగా మారిపోయింది.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. ఏది దొరికితే అది అందినకాడికి దోచుకుంటున్నారు. ఇసుక, రంగురాళ్లు, మట్టి... ఇలా ఏది కనిపించినా చాలు.. దోచుకుని కాసులు వసూలు చేసుకుంటున్నారు. ఇంతా జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. స్వయాన ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అయితే చెప్పలేని స్థాయిలో ఉందనే విమర్శలు వస్తున్నాయి.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో అక్రమార్కులు యథేచ్చగా మట్టిని తరలిస్తున్నారు. గ్రామంలోని టిడ్కో గృహాలవద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో.. జేసీబీ సాయంతో మట్టిని తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇలా తరలించిన ట్రాక్టర్ లోడు మట్టిని 800రూపాయల వరకు అమ్ముకుంటూ.. అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ మట్టి మాత్రమే కాకుండా పెన్నా నదిలోని ఇసుకను కూడా అక్రమార్కులు ఇలాగే సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.