MPP complained against YCP MLA: 'మనిషిగా కూడా చూడట్లేదు'.. ఎమ్మెల్యే తీరుపై మహిళా ఎంపీపీ కంటతడి
Woman MPP complained to Collector against MLA: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ తన పట్ల నియంతలా వ్యవహరిస్తూ తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు తన పట్ల ఎలాంటి ప్రోటోకాల్ పాటించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వివిధ పనుల కోసం అధికారులకు ఫోన్లు చేసినా 'మీరెవరు చెప్పడానికి' అని అంటున్నారని.. ఎమ్మెల్యే తమ మనుషుల్ని పెట్టుకొని పనులు చేస్తున్నారని తెలిపారు. మండలంలో ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలకు కూడా తనకు అహ్వానం పలకడం లేదని, ఈ నెల 10న పీహెచ్సీ శంకుస్థాపన, తాజాగా జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి కూడా పిలవలేదని వాపోయారు. అధికారులు, ఎమ్మెల్యే కనీసం తనను మనిషిగా కూడా చూడటం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రొటోకాల్ వ్యవహారంపై ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్‌కు పలుసార్లు ఫిర్యాదు చేశానని, గత నెల తొమ్మిదో తేదీన కలెక్టర్‌కు విన్నవించానని.. అయినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ మహిళా ప్రజా ప్రతినిధి కావడం వల్లే తన పట్ల ఇలా వ్యవహరిస్తున్నారని ఎంపీపీ రాజ్యలక్ష్మి మీడియా వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.