తిరుమలలో రథసప్తమి వేడుకలు సప్తవాహనాలపై విహరించిన మలయప్ప స్వామి
RATHASAPTAMI AT TIRUMALA తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వాహన సేవలు.. కన్నుల పండువగా జరిగాయి. ఉదయం ఐదున్నర గంటలకు వాహన మండపం నుంచి వాయవ్యం దిశకు స్వామి చేరుకున్నారు. భానుడి కిరణాలు స్వామి పాదాలకు తాకిన తర్వాత.. అర్చకులు హారతులు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి వాహన సేవను ప్రారంభించారు.
సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడు దర్శనమివ్వగా.. అనంతరం చినశేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. చినశేష సేవ తర్వాత.. గరుడ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు భక్తులను అనుగ్రహించాడు. స్వామి వారి దివ్య రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో తేలియాడారు.
హనుమంత వాహనంపై తిరుపతి మాఢవీధుల్లో ఊరేగిన వెంకటేశ్వరుడు.. అనంతరం మలయప్పస్వామి అవతారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత సర్వభూపాల వాహనంపై విహరించిన స్వామివారు.. చివరగా చంద్రప్రభ వాహనంపై పయనించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన శ్రీవారి వాహన సేవలు చివరగా చంద్రప్రభ వాహనంతో ముగిశాయి.
ఉదయం నుంచి వివిధ అవతారాలలో స్వామి వారి ఉత్సవ ఊరేగింపులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. స్వామి వారి వివిధ రకాల వాహన సేవల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు. గోవిందా, శ్రీనివాస, ఓం నమో వెంకటేశాయ నామస్మరణలతో తిరుపతి పురవీధులు మారుమోగిపోయాయి. స్వామి వారి వాహన సేవలో కోలాటాలు, కీర్తనలు, భక్తుల తన్మయత్వంతో తిరుమల పరిసరాలు కోలాహలంగా మారాయి.