నాగార్జున వర్సిటీలో ఆర్జీవీ సందడి.. విద్యార్థుల ప్రశ్నలకు ఏం చెప్పారంటే! - RGV comments on ANU
35 ఏళ్ల క్రితం విజయవాడ సిద్దార్ధ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశానని.. పట్టాను ఈ రోజు తనకు ఏఎన్యూ అందజేయడం ఆనందంగా ఉందని.. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున వర్సిటీలో నిర్వహించిన అకాడమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్జీవీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తనలాంటివారు హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్నే నమ్ముతారని చెప్పారు. మీకు నచ్చినట్లు మీరు జీవించాలని చెప్పారు. తను ఎప్పుడూ వెనుక బెంచీలోనే కూర్చునేవాడినన్న వర్మ.. వెనుక బెంచీవాళ్లే జీవితంలో పైకి వస్తారని చెప్పారు. వైరస్ వచ్చి మగజాతి మొత్తం చనిపోయినా.. తను ఒక్కడిని బతికుంటే చాలన్నారు. హీరోల రెమ్యూనిరేషన్ పెంపుదలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. హీరో మార్కెట్ వాల్యూ బట్టే ఇస్తారని.. ఇచ్చేవాళ్లకు.. పుచ్చుకునేవాడికి లేని సమస్య మనకు ఎందుకని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడాన్ని స్వాగతించిన ఆర్జీవీ.. మన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారని అభిప్రాయపడ్డారు.