Ramakrishna Reaction on Cases Against Chandrababu: చంద్రబాబుపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి.. లేదంటే ఉద్యమిస్తాం: రామకృష్ణ
Ramakrishna on cases against Chandrababu:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో ఇద్దరు మాజీ మంత్రులపై అక్రమంగా పెట్టిన హత్యాయత్నం కేసులను బేషరతుగా ఉపసంహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేసారు. పుంగనూరులో ప్రతిపక్ష నాయకులు పర్యటించే హక్కు లేదా.. అక్కడ వారు సభలు నిర్వహిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఎన్నడూ జరగనటువంటి దాడులు జరుతున్నాయని అన్నారు. పుంగనూరు ఏమన్నా నిషేధిత ప్రాంతమా అని నిలదీశారు. పుంగనూరులో పోలీసులను మోహరించి, వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పంపిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు చేసిన దుశ్చర్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. దాడి చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. అంగళ్లులో, పుంగనూరులో దాదాపు 270 మంది పైన కేసులు నమోదు చేశారు. ఈ ఘటనల్లో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రజాతంత్రవాదులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు.