విమానాల్లో బ్లాక్ బాక్స్ తరహాలో రైళ్లలోనూ ప్రత్యేక పరికరం.. కోరమాండల్ మిస్టరీలో 'కీ'లకం - coromandel express accident today
Coromandel Express Train : కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు మెయిన్ లైన్లో కాకుండా లూప్ లైన్లోకి వెళ్లడం వల్లే ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ తేల్చింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ను మెయిన్ లైన్లో వెళ్లేందుకు సిగ్నల్ ఇస్తే.. లూప్ లైన్ లోకి ఎందుకు వెళ్లిందనేదే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. మెయిన్ లైన్ కి సిగ్నల్ ఇచ్చాక రైలు లూప్ లైన్ లోకి వెళ్లేందుకు అస్కారమే లేదంటున్నారు... రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షించే నిపుణులు. లూప్ లైన్ ను, మెయిన్ లైన్ ను కలుపుతూ మధ్యలో ఇంటర్ లాకింగ్ ఉంటుందని, మెయిన్ లైన్ కు సిగ్నల్ ఇవ్వగానే ఆటో మేటిక్ గా లూప్ లైన్ లింక్ మూసుకు పోతుందన్నారు. దీనివల్ల రైలు నిర్ణీత మెయిన్ లైన్ పైకే వెళ్తుందంటున్నారు. రైల్వేలో సిగ్నలింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా, సమర్ధంగా ఉంటుందని రెండు లైన్ల మధ్య ఇంటర్ లాకింగ్ వ్యవస్థ లో మార్పులే ప్రమాదానికి కారణమై ఉండొచ్చంటున్నారు. సిగ్నలింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉంది తప్ప వ్యవస్థలో లోపాలు లేవని ఖచ్చితంగా చెబుతున్నారు. విమానంలో బ్లాక్ బాక్స్ తరహాలోనే రైలులోనూ అలాగే పనిచేసే ఓ పరికరం ఉంటుందని, వీటితో పాటు సిగ్నలింగ్ వ్యవస్థ సైతం రికార్డు చేసే విధానం అమల్లో ఉందన్నారు. వీటిని పరిశీలిస్తే రైలు ప్రమాదానికి ముందు జరిగిన ప్రక్రియలన్నీ వెలుగు చూస్తాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వేలో భద్రతా వ్యవస్థ వ్యవస్థను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉందంటోన్న రైల్వే సిగ్నలింగ్ నిపుణుడు, ఆల్ ఇండియా రైల్వే కంట్రోలర్స్ అసోసియేషన్ నేత మారేపల్లి జోషితో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి.