Python Caught in Fish Net: వలలో చిక్కిన కొండచిలువ.. భయందోళనలో జాలరులు - python caught in godavari river
Python Caught in Fish Net in East Godavari : చేపల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. మత్స్యకారులు, స్థానికులు కొందరు చేపల వేట కోసం వలలు వేశారు. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడికి వింత అనుభవం ఎదురయ్యింది. బరువెక్కిన చేపల వలను ఆశగా పైకి లాగేసరికి అందులో భారీ కొండచిలువ కనిపించింది. దాంతో ఆ జాలరి భయపడ్డాడు. బయటకు తీసిన భారీ అనకొండను చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఎగువ ప్రాంతాల కురిసిన వానల ధాటికి వరద ప్రవాహంతో గోదావరి పోటెత్తడంతో పాము కొట్టుకొచ్చి, వలలో చిక్కుకొని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సాయంతో పాము వలను తొలగించి.. తిరిగి కొండచిలువ గోదావరిలో వదిలేశారు. ఈ దృశ్యాన్ని కొందరు ఔత్సాహికులు సెల్ఫోన్లలో బంధించి, సామాజిక మాద్యమాల్లో పెట్టడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది.