దళితులంటే చిన్న చూపు - సీఎం జగన్పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు - పూతలపట్టు ఎమ్మెల్యే
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 3:07 PM IST
Puthalapattu YSRCP MLA MS Babu Comments on CM Jagan :అధికార వైఎస్సార్సీపీలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకొకరు బయటకు వచ్చి జగన్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నియోజకవర్గాల్లో ఇంచార్జ్లను మార్చడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి చూపడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేకపోయినా మార్పులు చేస్తున్నారని, ఓసీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్నా మార్చడం లేదని ఆయన ఆరోపించారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని, దళిత ఎమ్మెల్యేలు అంటే జగన్కు చిన్న చూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు జగన్ ఏమీ న్యాయం చేశారని నిలదీశారు.
CM Jagan Changing Constituency Incharge :సీఎం జగన్ చెప్పక ముందే తాను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగానని ఎంఎస్ బాబు తెలిపారు. అలాగే జగన్ చెప్పినట్లుగానే అన్ని కార్యక్రమాలు చేశానని, ఇప్పుడు తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నానని, ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.
డబ్బులు ఇస్తే ఐప్యాక్ సర్వే ఫలితాలు మారాల్సిందే : ఐదు సంవత్సరాలల్లో ఎప్పుడైనా జగన్ పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు నిలదీశారు. ఇప్పుడు ఐప్యాక్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని, వచ్చే ఎన్నికల్లో పూతలపట్టు టికెట్ ఆశించవద్దని తగదని అన్నారు. డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్ల సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని ఆరోపించారు. గత ఎన్నికలలో ఐప్యాక్ సర్వే ఇస్తేనే తనకు టికెట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు.