అప్పుల ఊబిలో రాష్ట్రం - అందుకే జగన్‌ది స్టిక్కర్ల ప్రభుత్వం: పురందేశ్వరి - బీజేపీ లీడర్ పురందేశ్వరి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 5:46 PM IST
Purandeswari comments on YCP bus yatra:సామాజిక సాధికార యాత్ర చేసేందుకు వైసీపీకి ఏ నైతిక హక్కు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు ? వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో ఎస్సీ వర్గానికి చెందిన 27 పథకాలను ఎత్తివేసిందని ఆరోపించారు. విజయనగరం జిల్లాలో బీజేపీ బూత్ స్వశక్తికరణ, జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీసీ కులాల్లోని బిడ్డలకూ న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్లలో బీసీ వర్గానికి చెందిన ఓ యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టారని.. చిత్తూరు జిల్లాలో ఓ యువతికి శిరోముండనం జరిగిందని ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా బాధితులకు రాష్ట్రంలో తగిన న్యాయం జరగలేదని ఆరోపించారు. ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేయని వైసీపీ ప్రభుత్వం.. సామాజిక సాధికార యాత్ర ఎలా చేస్తుందని పురందేశ్వరి ప్రశ్నించారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. కానీ, వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు జీతాలు, పీఎఫ్ చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ సుపరిపాలన అందిస్తుంటే, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు.
అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు: జగన్ సొంత పాలన కొనసాగిస్తూ... అన్ని వర్గాలను, రంగాలను నిర్వీర్యం చేశారని పురందేశ్వరీ మండిపడ్డారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని దారి తప్పించి.., జగన్ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఆరోపించారు. అందుకే జగన్ ప్రభుత్వానికి స్టిక్కర్ల ప్రభుత్వంగా నామ కరణం చేశామన్నారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసిన వైసీపీ, సామాజిక సాధికార యాత్ర ఎలా చేస్తుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి తెలిపారు. వైసీపీ పాలనపై రాష్ట్ర ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని పురందేశ్వరి సూచించారు.