చంద్రబాబు రాకతో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల సంబురాలు ఆలయాల్లో పూజలు, కేక్ కటింగ్స్ - Andhra Pradesh News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 3:02 PM IST
Pujas on The Occasion of Chandra Babu Release to Jail : చంద్రబాబు జైలు నుంచి విడుదలైన సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గంగమ్మ తల్లి దేవాలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమే గెలిచిందంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మరి కొంతమంది మహిళలు మాట్లాడుతూ.. ఇప్పటికీ తాము సగం సంతోషాన్ని మాత్రమే పొందుతున్నామని, పూర్తి స్థాయి ఆనందం రావాలంటే ఈ రాక్షస ముఖ్యమంత్రిని గద్దెదించి ఆంధ్రపదేశ్ నుంచి పారద్రోలి.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి వచ్చిన సందర్భంగా.. అనంతరం పిడుగురాళ్ల మండలం చిన్న అగ్రహారం గ్రామంలో బ్రాహ్మణపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానంలో కొబ్బరికాయలు కొట్టి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత గ్రామంలో మహిళలు భారీ కేకును కట్ చేసి 'జై తెలుగుదేశం... జై చంద్రబాబు నాయుడు' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం కనిపించింది.