Payyavula on Rayalaseema project సీబీఐ విచారణకు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నాం.. త్వరలో లేఖ: పయ్యావుల - వైసీపీ
Payyavula keshav cbi enquiry: రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల పనులపై మంత్రి అంబటి రాంబాబు సీబీఐ విచారణకు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు. దీనిపై త్వరలోనే తప్పకుండా సీబీఐకి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. రూ.900 కోట్ల రుణం తీసుకుంది నిజమే గానీ, కాంట్రాక్టర్లకు నేరుగా విడుదల చేసింది రూ.739 కోట్లే అని, ఎంబుక్ రికార్డింగ్, సీఎఫ్ ఎంఎస్ లో అప్ లోడింగ్ తర్వాతే రిలీజ్ చేశామని మంత్రే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసిన అఫిడవిట్లో కేవలం ఇన్వెస్టిగేషన్ పనులు మాత్రమే చేస్తున్నామని.. ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టలేదని పేర్కొందని వివరించారు. పనులు చేపట్టినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శిక్ష తప్పదని కూడా కోర్టు హెచ్చరించిందని పయ్యావుల తెలిపారు. కానీ, పనులు జరిగాయని, ఎం బుక్ రికార్డ్ జరిగిందని, అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే బిల్లులు చెల్లించామని నిన్న మంత్రి రాంబాబు చెప్పారని విమర్శించారు. పనులు చేయడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసిన అఫిడవిట్ నిజమా లేక... ఇప్పుడు పనులు జరిగాయని మంత్రిగారు చెప్పింది నిజమా అని నిలదీశారు. అప్పుడు కోర్టులను తప్పు దోవ పట్టించారా..? ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వెనుక భారీ స్కామ్ జరిగిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో ఎలక్ట్రో మెకానికల్ వర్కులు దాదాపు రూ.100కోట్లే అని గుర్తు చేసిన పయ్యావుల అలాంటిది రూ.739కోట్లు రిలీజ్ చేశామని మంత్రే చెప్పారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు 2020 జులై 13న టెండర్లు పిలిచింది రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అని గుర్తుచేశారు. ఆరోజుకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ అస్థిత్వంలోనే లేదని తెలిపారు. ఆ తర్వాత 2020 అక్టోబర్ 29న పనులు నిలుపుదల ఉత్తర్వులను కోర్టు ఇచ్చిందని... అంటే టెండర్లు పిలిచిన నాటికి, కోర్టు స్టే ఇచ్చిన నాటికి కార్పోరేషన్ లేదని వివరించారు. 2020 నవంబర్ 3న కేవలం రుణాన్ని తీసుకోడానికి మాత్రమే ఈ కంపెనీని ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు.