ఉరవకొండలో ప్రొటోకాల్ గొడవ.. ఎంపీడీఓపై ఎమ్మెల్సీ అనుచరుల ఆగ్రహం
Protocol Controversy : ఉరవకొండ పట్టణంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ ముందుకు వచ్చింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరాం రెడ్డిని కాకుండా, ఇంకా సభ ప్రాంగణానికి రాని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని వేదిక పైకి ఆహ్వానించడం ఏమిటి అంటూ ఎమ్మెల్సీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉరవకొండ ఎంపీడీఓ చంద్రమౌళితో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. జగనన్న నవరత్నాల్లో భాగంగా 3వ విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ఉరవకొండ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్సీ శివరాంరెడ్డి వేదిక దగ్గరకు హాజరయ్యే క్రమంలో వేదికపై ఉన్న ఉరవకొండ ఎంపీడీఓ చంద్రమౌళి.. ఇంకా సమావేశ ప్రాంగణంలోనికి రాని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ని వేదిక పైకి రావాలంటూ ఆహ్వానించడంతో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చింది ఎవరో కూడా తెలియదా అంటూ ఎంపీడీఓపై విరుచుకుపడ్డారు. దీంతో ఖంగుతిన్న ఎంపీడీఓ చంద్రమౌళి.. ఎమ్మెల్సీ శివరామి రెడ్డికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన తన అనుచరులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.