MLA Ravindranath Reddy: ఆ ఎమ్మెల్యేకు గ్రామస్థుల వెరైటీగా షాక్.. ఇలా కూడా నిరసన ఉంటుందా..!
MLA Ravindranath reddy వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం' నిర్వహిస్తుంది. కానీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. వైఎస్సార్ జిల్లాలో మాత్రం గ్రామస్థులు వినూత్నంగా తమ అభిమతం తెలిపారు. గ్రామస్థుల నిరసనతో ఒక్కసారిగా షాక్ అయిన ఆ ఎమ్మెల్యే.. ప్రజలు లేకపోయినా, కెమెరాల ఎదుట.. గడప గడప కార్యక్రమం కొనసాగించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం దేవరాజు పల్లిలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి నిరసన సెగ గట్టిగానే తగిలింది. గురువారం 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం'లో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గ్రామంలోని కొంత మంది ఇళ్లపై తెలుగుదేశం పార్టీ జెండాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అంతేకాక దేవరాజు పల్లి ఎస్సీ కాలనీలోని దాదాపు 50 కుటుంబాలు ఇంటిపై తెలుగుదేశం జెండాలు ఏర్పాటు చేశారు. తమ కుటుంబ సభ్యులంతా ఎవరూ లేకుండా ఇళ్లకు తాళాలు వేసి మరీ నిరసన తెలిపారు. గ్రామంలో ఎవ్వరూ లేనప్పటికీ తగ్గేదేలే అంటూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కాలనీ మొత్తం తిరిగారు. దేవరాజు పల్లి గ్రామానికి టీడీపీ ఇంచార్జ్ పుత్తా నరసింహా రెడ్డి స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఉండటంతో సీఐ, ముగ్గురు ఎస్సైలు, దాదాపు 20 మంది పోలీసులు బలగాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.