Protest for Chandrababu in Half Saree Function ఓణీల మహోత్సవంలో "బాబు కోసం నేను సైతం" .. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన.. - Chandrababu illegal arrest updates
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 7:20 PM IST
Protest for Chandrababu in Half Saree Function :టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. ఓణీల మహోత్సవంలో చంద్రబాబుకు మద్దతుగా వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీపతి మనవరాలు శివజోషిత ఓణీల మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుకు మద్దతుగా శ్రీపతి కుటుంబ సభ్యులు వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఇంటికి పెద్దదిక్కు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో.. ఇవాళ ఏపీకే పెద్ద అయిన చంద్రబాబు ఈ పరిస్థితిలో ఉండటం కూడా అంతే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబు కోసం నేను సైతం అంటూ నిరసనలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ప్రత్తిపాటి పుల్లరావు మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేసిన చంద్రబాబు ఈ రోజు నిర్భంధంలో ఉండడంపై ప్రతి కుటుంబం ఎంతో ఆవేదన చెందుతోందని, ఆయన రాక కోసం ప్రతి ఒక్కరు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతటా దసరా ఉత్సవాలు చేసుకుంటారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు కూడా త్వరలో ఈ అక్రమ కేసులు, నిర్భంధాలను గెలిచి బయటకు రావాలని, ఆ రోజే రాష్ట్రానికి అసలైన దసరా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.