Protest Against YCP MLA Sudhakar in Gadapagadapaku Programme: వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. సమస్యలపై ఏకరువు పెట్టిన స్థానికులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 2:23 PM IST
Protest Against MLA Sudhakar in Gadapagadapaku Mana Prabhutvam Programme:వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తిప్పలు తప్పటం లేదు. ఓట్లేసి గెలిపించినందుకు నాలుగేళ్ల కాలంలో గ్రామాలకు అభివృద్ది ఏం చేశారంటూ స్థానికులు నిలదీస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు నిరసన సెగ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సి బెళగల్ మండలం పల్దొడ్డి గ్రామానికి వెళ్లారు. ఆయన వస్తున్నారని తెలుసుకున్న విద్యార్థులు, గ్రామస్థులు ఎమ్మెల్యేను అడ్డుకుని నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టి సమస్యలు ఏకరువు పెట్టారు. ఇసుక టిప్పర్ల కారణంగా రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయిందని.. దీని వల్ల బస్సులు తిరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక టిప్పర్లు తమ గ్రామాల్లోంచి వెళ్లకుండా చేయాలని కోరారు.