వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు నిరసన సెగ..ఆ హామీలు ఏమాయ్యాయి..? - వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు నిరసన సెగ
Protest against YCP MLA Gorle Kiran Kumar: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం నిద్దాం పంచాయతీలో నేడు చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. ''ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు మా గ్రామానికి వచ్చి పలు హామీలు ఇచ్చారు కదా.. మీరు గెలుపొంది ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తుంది.. ఇప్పటికీ ఎన్నికల ముందు మీరిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఎందుకు? ఇప్పుడు గడప-గడపకు కార్యక్రమం ఉందని మా గ్రామానికి వచ్చారా..?'' అంటూ గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు.
అనంతరం నిద్దాం గ్రామానికి తారు రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు కదా.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికీ రోడ్డు వేయలేదు, ఇంటింటికి కుళాయి వేస్తామని హామీ ఇచ్చారు.. అది కూడా వేయించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, 'నిరుద్యోగ యువతకు మీరు, మీ ప్రభుత్వం గెలిచాక ఏమీ జాబ్‌లు ఇచ్చారు?, డీఏస్సీ వేయలేదు, అరకొర గ్రూప్ నోటిఫికేషన్‌లు ఇస్తే.. ఎలా సరిపోతాయి' అంటూ యువత ప్రశ్నించారు. ఇల్లు నిర్మాణం కోసం 35 మంది దరఖాస్తు చేస్తే.. అందులో 19 మందికి మాత్రమే ఇళ్లు మంజూరు చేశారని.. మిగిలిన వారికి ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. దీంతో పాటు గ్రామంలో వివిధ మహిళా సంఘాల్లో 800 మంది సభ్యులు ఉంటే 25 మంది మహిళలకు మాత్రమే సున్నా వడ్డీ వచ్చిందని.. ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. గ్రామానికి తారురోడ్డు ఎప్పుడు వేస్తారో.. ఇప్పుడే తమకు హామీ ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుపట్టారు.