Gadapa Gadapaku Program: 'ఏం చేశారని వైసీపీకి ఓటేయాలి'.. ఎమ్మెల్యే ద్వారంపూడికి నిరసన సెగ.. - ఎమ్మెల్యే ద్వారంపూడికి లేటెస్ట్ న్యూస్
Gadapa Gadapaku Program: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఓ మహిళ నుంచి తీవ్ర నిరసన సెగ తగిలింది. జిల్లాలోని ఆరో డివిజన్ రేచేర్లపేటలోని ఎస్సీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తుండగా.. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను ఉద్దేశించి నిరసన గళం విప్పింది. ఏం చేశారని జగన్కు ఓటేయాలని ఆమె ప్రశ్నించింది. ఈ క్రమంలో వైసీపీకి తాము ఓటెసేదే లేదని తేల్చి చెప్పింది. ఇల్లులేని వారికి ఇల్లు ఇవ్వటం లేదని, ఉన్నవారికే అన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అద్దె ఇంటిలో ఉన్న ఆమెకు ఇల్లు మంజూరు చేయలేదని.. ఆయనకు నచ్చినవారికే అన్ని పథకాలు అందిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామంలో కాలువలు కంపుకొడుతున్నా పట్టించుకోవట్లేదని, ఇంటి ముందు ఉన్న చెత్తను వారం రోజులైనా తీసేవారే లేరని మండిపడింది. దీంతోపాటు వైసీపీ ప్రభుత్వంలో రోజు రోజుకు ధరలు మండిపోతున్నాయని ఆక్రోశం వెళ్లగక్కింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే, వాలంటీర్లు, సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.