Professors Rally thanking CM Jagan: నాగార్జున వర్సిటీలో 'స్వామి భక్తి'.. 'వీళ్లు ఆచార్యులా వైసీపీ కార్యకర్తలా' అంటూ విమర్శలు
Professors Rally by Thanking CM YS Jagan: రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొన్ని వర్సిటీలు రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా అధికార వైసీపీకి తమ స్వామి భక్తిని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను భజన చేయడంలో ఆ పార్టీ కార్యకర్తలను మించిపోయారు.. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు. యూనివర్సిటీల్లోని ఆచార్యుల ఉద్యోగ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎంకు భజన చేసేందుకు ఆచార్య నాగార్జున వర్సిటీ ఆచార్యులు పోటీ పడ్డారు. విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత థ్యాంక్యూ సీఎం జగన్ సర్ అంటూ ఉపకులపతి కార్యాలయం నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ తతంగాన్ని చూసిన వర్సిటీలోని విద్యార్థులు వీళ్లు ఆచార్యులా వైసీపీ కార్యకర్తలా అంటూ నోళ్లు వెళ్లబెట్టారు.