'దివ్యాంగుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది'
Neglecting the welfare of the disabled: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమం గాలికి వదిలేసిందని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ దివ్యాంగ సంఘాల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు కొనతం చంద్రశేఖర్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ దివ్యాంగులకు నిరుద్యోగ భృతి 5 వేలు రూపాయలు ఇవ్వాలన్నారు. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు నోచుకోవటం లేదు, 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అమలు చేయడం లేదన్నారు. వికలాంగులు భిక్షాటనే ఉపాధిగా రాష్ట్రాన్ని వదిలి వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రాల్లో దివ్యాంగులకు కాలనీలలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. వికలాంగుల సమస్యలపై ప్రభుత్వ పెద్దలకు, కలెక్టర్లకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. ఇప్పటివరకు తొలగించిన వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం, సమస్యలు పరిష్కారం చేయాలి.. లేనియెడల పోరాటాలకు సిద్ధం అవుతామని.. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.