Alluri district are suffering from doli carrying: అల్లూరి జిల్లాలోని గిరిజనులకు తప్పని డోలీ మోతలు - Latest News Videos of Ananthagiri Mandal
Dolly burdens for tribals:అల్లూరి జిల్లాలోని గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ బూరుగ గ్రామానికి చెందిన సోమిల చిన్నమ్మి నిండు గర్భిణి. వైద్య సేవల కోసం విజయనగరం జిల్లా మెంటాడ ఆసుపత్రికి తరలించేందుకు బంధువులు..సుమారు ఎనిమిది కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు. సరైన కాలి బాట కూడా లేక గర్భిణిని తీసుకెళ్లేందుకు మూడు గంటల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఆ మహిళకు ఏదైనా జరిగితే.. పరిస్థితి ఏంటని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. గ్రామంలో 40 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే బూరుగ గ్రామం నుండి మెంటాడ రోడ్డు వరకు ఎనిమిది కిలోమీటర్లు డోలీ కట్టుకొని రోగులను తరలించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏ చిన్న అనారోగ్యానికి అయినా డోలి మోతలే శరణ్యం అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏజెన్సీలో రహదారుల అభివృద్ధికి కోట్లు ఖర్చు పెట్టామని అధికారులు, రాజకీయ నాయకుల ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కనీస మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు.