గర్భిణులకు పురిటి నొప్పులు - ఏజెన్సీలో గిరిజనులకు తప్పని డోలీ మోతలు - ఏజెన్సీలో డోలీ మోత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 5:12 PM IST
Pregnent Women in Alluri District: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రాంతంలో గిరిజనుల పరిస్థితి మారటం లేదు. తరాలు మారినా కొండల్లో డోలీ మోతల కష్టాల నుంచి ప్రజలకు విముక్తి లభించటం లేదు. కనీస సౌకర్యాలు విషయం పక్కన పెడితే అత్యవసర సమయాల్లో వారి పరిస్థితి మరింత దీనంగా ఉంటోంది. తాజాగా బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కొండల్లో రహదారి సౌకర్యం లేకపోవటంతో నిండు గర్భిణిని డోలిలో ఏడు కిలోమీటర్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
Dolly Mota in Agency: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ రాచకీలం గ్రామానికి రోడ్డు మార్గం లేదు. ఆ గ్రామానికి చెందిన రూతు అనే గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో గ్రామస్తులు ఆమెను డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాచకీలం గ్రామం నుంచి బల్లగరువు వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మేర డోలీ మోతలో తీసుకెళ్లామని గ్రామస్తులు తెలిపారు. సరైన కాలిబాట లేక గర్భిణిని తరలించటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారికి చేరిన తరువాత అంబులెన్సుకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆటోలో 20కిలోమీటర్లు ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రహదారి వేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.