Pregnant Women Problems: ఒకచోట ఎండలో.. మరో చోట చీకట్లో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీల అవస్థలు - ఆసుపత్రిలో కరెంట్ కట్
Pregnant women are suffering: ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద గర్భిణులకు ప్రభుత్వం ఆసుపత్రిలో పరీక్షల విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు ఇబ్బందులు పడ్డారు. స్కానింగ్ పరీక్ష కోసం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి 300 మందికి పైగా గర్భిణులు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో గర్భిణులకు తాగునీరు, ఎండ నుంచి రక్షణగా షామియానా, కుర్చీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 50 కుర్చీలు ఒక షామియానా ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కుర్చీలు, షామియానా చాలక గర్భిణులు స్కానింగ్ కోసం గంటల తరబడి వరుసలో నిల్చున్నారు. గర్భిణులు ప్రతి నెల నిర్వహించే స్కానింగ్ పరీక్షల కోసం ఆసుపత్రికి వందల మంది గర్భిణులు వస్తున్నా... అధికారులు కనీస వసతులు కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రిలో అంధకారం నెలకొంది. గుత్తిలో ఓ మోస్తారు వర్షం కురవడంతో విద్యుత్ శాఖ అధికారులు సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ లేక గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అంధకారంగా మారింది. దీంతో డెలివరీకి వచ్చిన గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతూ.. చీకటిలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గర్భిణీల బంధువులు ఆసుపత్రి వర్గాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడి నాలుగు గంటలు గడుస్తున్న ఆసుపత్రి సిబ్బంది జనరేటర్ వేయలేదని.. చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గర్భిణీ స్త్రీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.