Prathipati Pullarao Fires on Jagan వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే గ్రహించి.. జగన్ పిచ్చిపట్టినట్లు ప్రవరిస్తున్నారు: ప్రత్తిపాటి పుల్లారావు - సీఎం జగన్పై టీడీపీ నేతల కామెంట్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 8:00 PM IST
Prathipati Pullarao Fires on Jagan: రాబోయే ఎన్నికల్లో వైసీపీకు భారీ ఓటమి తప్పదని అన్ని సర్వేల్లో తేటతెల్లమైందని.. దీంతో జగన్ పిచ్చిపట్టినట్లు ప్రవరిస్తూ రాష్ట్రాన్ని భయానకంగా మార్చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. ఎలాగో అధికారాన్ని కోల్పోబోతున్నామని తెలిసే జగన్ బరితెగించారని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏడవ రోజు రిలే నిరాహార దీక్షలో మాజీమంత్రి ప్రత్తిపాటి పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా చిలుకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. రాష్ట్రంలో కొంతమంది ఉన్నతాధికారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమో లేక ఫ్యాక్షనిజమో సీఎం జగన్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూల్చివేతలు, అరెస్టులు, నిర్భంధాలు, దాడులు, హత్యలు తప్ప ఈ ప్రభుత్వం చేస్తోంది ఏంటని ప్రత్తిపాటి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా విదేశాల్లో సైతం నిరసనలు చేస్తున్నారని.. రోడ్లపైకి రావడానికి మహిళలు, యువత సహా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.