Prathidwani: అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్టేది..? - ఈటీవీ ప్రతిధ్వని
Prathidwani: మొన్న మాచర్ల.. నేడు వినుకొండ.. ప్రాంతం పేరు మారొచ్చేమో గానీ.. అధికార పార్టీ దాడులు, అరాచకాలు మారడం లేదు. కొట్టినా, తిట్టినా, చివరకు చంపేసినా.. వైసీపీ నాయకులు చెప్పిందే శాసనం.. చేసిందే చట్టం అన్నట్లు.. పరిస్థితి మారిందని విపక్షాలు, ప్రజాసంఘాలు వాపోతున్నాయి. పల్నాడులో కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణలు దేనికి సంకేతం? మాచర్ల నుంచి వినుకొండ వరకు అధికార వైసీపీ దౌర్జన్యాలు ఏం చెబుతున్నాయి? అక్రమ మైనింగ్, అధికార అరాచకాలపై విపక్షాలు ప్రశ్నిస్తూ ఉండడమే పల్నాడులో ఇంత హింసాకాండకు కారణమా? నాలుగేళ్లుగా ఇంత హింసకు, రక్తచరిత్రకు కారణమేంటి? మాచర్ల, పల్నాడు అనే కాక మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ ఆగడాలపై గతంలో అనేక వార్తలు వచ్చాయి? అయినా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ అక్కడ బాధితులకు ఎందుకు అండగా నిలబడట్లేదు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు.. ఎవరైనా కావొచ్చు.. పల్నాడులో ప్రతిపక్షాలు ఉండకూడదా? గతంలో స్థానిక ఎన్నికలప్పుడు కూడా వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడింది. శాంతిభద్రతలు ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి అక్కడ ప్రతిపక్షాలు ఉంటాయా.. అని అంటున్న వారి ఆవేదన.. ఆందోళనలకు సమాధానం ఎక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.