Prathidwani: విభజన హామీలను సీఎం జగన్ ఎంతవరకు సాధించగలిగారు..! - Prathidwani
Prathidwani: రాష్ట్రం విడిపోయాక.. 2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయి. అప్పటి సీఎం చంద్రబాబు రాష్ట్రానికి విభజన హామీలు సాధించటంలో ఘోరంగా విఫలమయ్యారని నాటి ప్రతిపక్షనేత జగన్ ఊరువాడా తిరిగి విమర్శించారు. యువభేరీలు పెట్టి ప్రత్యేక హోదా కోసం యువతను రెచ్చగొట్టారు. చంద్రబాబు తనపై కేసులు కారణంగానే మోదీ సర్కార్‌తో రాజీపడ్డారని దుమ్మెత్తిపోశారు. ప్రత్యేక హోదా అనే డిమాండ్ కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశం మొత్తం అదో సంచలనం అవుతుందని, దేశం దృష్టిని ఆకర్షిస్తామని, కేంద్ర దిగి వస్తుందని జనాలను నమ్మించారు జగన్. అంతటితో ఆగారా.. సోనియాగాంధీనే ఎదిరించిన తనకి కేంద్రం ఓ లెక్క కాదన్నట్టుగా మాట్లాడారు. మరి ఈ రోజు 22 మంది లోక్‌సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యులు.. మొత్తంగా వైసీపీకు 31 మంది పార్లమెంట్ సభ్యులున్నారు. వారంతా దిల్లీ వెళ్లి కేంద్రం మెడలు ఎంతవరకు వంచారు? సీఎం జగన్ ఇప్పటికి సుమారు 20 సార్లు దిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ప్రతిసారి ఒకటే పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. అందులో తేదీలే మారతాయి. దాదాపుగా లోపల మేటర్ అంతా ఒకటే ఉంటుంది. విభజన హామీలు, పోలవరం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి అడిగినట్టు చెబుతారు. అసలు జగన్ దిల్లీ పర్యటనల ఆంతర్యం ఏంటి? అనేదే నేటి ప్రతిధ్వని.