Prathidwani: రాష్ట్రంలో ముట్టుకోకుండానే షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు - prathidhwani on jagan govet
prathidhwani: రాష్ట్రంలో ముట్టుకోకుండానే షాక్ కొడుతున్నాయి.. కరెంటు బిల్లులు. వైకాపా ప్రభుత్వం బాదుడే బాదుడే పథకంలో విద్యుత్ ఛార్జీల దెబ్బకు సామాన్య, మధ్యతరగతి, పారిశ్రామిక వర్గాలు అల్లాడిపోతున్నారు. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు, విద్యుత్ సుంకం, కస్టమర్ ఛార్జీల పేరుతో వేస్తున్న భారాలను ఎలా మోయాలంటూ ఆక్రోశిస్తున్నారు అందరూ. వీటన్నింటి రూపాల్లో ఏటా సుమారు 11,270 కోట్లు అదనంగా వసూలు చేస్తున్న సర్కార్.. గృహ వినియోగదారులకు రూ.13 వేల కోట్లు, వ్యవసాయ మోటార్లకు రూ.6,888 కోట్ల వ్యయంతో స్మార్ట్ మీటర్లు అమర్చబోతోంది. మళ్లీ ఆ భారం కూడా ట్రూఅప్ ఛార్జీల రూపంలో మళ్లీ ప్రజలపైనే వేయనుందన్న మాటే కలకలం రేపుతోంది.
సామాన్య ప్రజలు, పరిశ్రమల నుంచి ఇలా ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. తాను డిస్కమ్‌లకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై ఏం చేస్తోంది? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రభుత్వం నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలకు రావాల్సిన బకాయిలు ఎంత? ప్రజలకు కావొచ్చు... పరిశ్రమలకు కావొచ్చు... ఇదే విద్యుత్ విధానం కొనసాగితే రాష్ట్రం ఇకపై ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? చక్కదిద్దాలంటే ఏం చేయాలి? అసలు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల వాతలు ఎందుకు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.