Tension in Kondepi కొండేపిలో పోటాపోటీ నిరసనలు.. ఉద్రిక్తత! టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్! - ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి
Tense atmosphere in Kondepi constituency ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికోట అశోక్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే డోల వీరాంజనేయస్వామి పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. భారీగా కార్యకర్తలను సమీకరించి టంగుటూరు నుంచి నాయుడుపాలెం వెళ్లేందుకు సిద్దమైయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే స్వామి, తెలుగుదేశం నాయకులు నిధులు స్వాహా చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. టంగుటూరులోని పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఇదే సమయంలో భారీగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే డోలా ఇంటికి చేరుకొని.. వైసీపీ శ్రేణులను ప్రతిఘటించేందుకు సిద్దమైయ్యారు. జాతీయ రహదారిపై కి వచ్చి టీడీపీ శ్రేణులు నిరసన చేస్తుండగా పోలీసులు ఎమ్మెల్యే అరెస్ట్ చేశారు. డోల వీరాంజనేయస్వామిను అదుపులో తీసుకున్న సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎమ్మెల్యే చొక్కా చిరిగిపోవడంతో.. టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని ఎక్కించిన పోలీస్ వాహనం వెంట కార్యకర్తలు పరుగులు తీశారు. ఎమ్మెల్యే పట్ల పోలీసుల తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఈ పరిణామాల నడుమ నాయుడుపాలెం వెళ్లకుండా నియోజక వర్గ వైసీపీ ఇంచార్జ్ అశోక్బాబును పోలీసులు అడ్డుకున్నారు.