KA Paul on CM Jagan: "నాలుగేళ్లలో రాష్ట్రం రావణ కాష్టం.. కోమాలోకి తీసుకెళ్లిన సీఎం" - చేనేత సమస్యలు
KA Paul fire on CM Jagan: వైఎస్సార్సీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించిన ఆయన.. అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ధర్మవరం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అయితే.. చేనేత సమస్యలు, కార్మికుల ఆత్మహత్యలు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ పేరుతో అక్కడ ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసి కోమాలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. గతంలో ఉన్న టీడీపీ, ప్రస్తుతం ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ కుటుంబ పార్టీలుగా కొనసాగుతూ వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వారాహి పేరు కాకుండా నారాహి పేరుతో నారా లోకేశ్‌ను గెలిపించడానికి యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్యాకేజీ స్టార్‌గా ఉంటూ పార్టీని తన అన్నలాగా విలీనం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ఈ కుటుంబ పార్టీలు పోవాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకం కావాలని పేర్కొన్నారు. ఆయా వర్గాలు ప్రజాశాంతి పార్టీలో చేరి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజలు గమనించి ఈ కుటుంబ పార్టీలను వెళ్లగొట్టేలా ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.