ప్రత్తిపాడు టికెట్టు కోసం పోటాపోటీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 10:56 AM IST
Prajadeevena Program Conducted By Parvatha Prasad: కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జి మార్పుతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కొత్తగా నియమితులైన ఇన్ఛార్జి వరుపల సుబ్బారావు మధ్య టికెట్ పోరు పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తుంది. ఒక పక్క ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ప్రజాదీవెన పేరుతో జన సమీకరణ ర్యాలీ చేపట్టి బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మరో పక్క నియోజకవర్గ ఇన్ఛార్జి సుబ్బారావు గ్రామాల పర్యటన పేరుతో ప్రజాదరణ సమీకరణకు పదును పెట్టారు. తనకు ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు టికెట్ కూడా ఇస్తారని సుబ్బారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారని పర్వత ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
చివరి నిమిషంలో అయినా జగన్మోహన్ రెడ్డి వైసీపీ టికెట్ తనకే కేటాయిస్తారని, ముఖ్యమంత్రి ఆశీస్సులు తనకు ఉన్నాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. రౌతులపూడి మండలం పి.చామవరంలో ప్రజాదీవెన కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.