Power Looms Stopped: ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాలు.. ధర్మవరంలో మరమగ్గాలు నెల బంద్ - power loom stopped for one month in Dharmavaram
Power Looms Bandh for One Month: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాలతో మరమగ్గాలను నెలరోజుల పాటు బంద్ చేస్తున్నామని మరమగ్గాల అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు.. వెంకటనారాయణ, రవి ప్రకటన చేశారు. ధర్మవరంలో చేనేత మగ్గాలు.. మర మగ్గాల వల్ల దెబ్బతింటున్నాయని.. అందువలన మరమగ్గాలను కొన్ని రోజులు నిలిపివేయాలని ఎమ్మెల్యే తమను ఆదేశించడంతో జులై ఒకటి నుంచి నెలాఖరు వరకు పూర్తిగా ఆపేస్తున్నామని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. మరమగ్గాలపై తయారు చేసిన చీరల నిల్వలు భారీగా ఉండటంతోనే మగ్గాలు బంద్ చేస్తున్నారని.. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే జోక్యం ఏమిటని మర మగ్గాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. కేవలం మర మగ్గాలు నెల రోజుల పాటు ఆపేస్తే.. చేనేతలు ఎలా అభివృద్ధి చెందుతారని నిర్వాహకులు ప్రశ్నించారు. దీని కోసం చేనేత నాయకులు, ఇతర నేతలు ఏ విధంగా నెల రోజులలో అభివృద్ధి చేస్తారని.. ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.