power cut in area Hospital: అంధకారంలో నర్సాపురం ఏరియా ఆసుపత్రి.. అల్లాడిపోయిన రోగులు
Short Circuit In Narasapuram Area Hospital : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం అంధకారం ఆసుపత్రిలోని విద్యుత్ సరఫరా లైన్లు షార్ట్ సర్క్యూట్‌తో కావడం వలన మంగళవారం సాయంత్రం ఐదుగంటలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. స్పందించిన ఆసుపత్రి ఇన్చార్జి పర్యవేక్షకుడు కేఎస్ త్రిమూర్తులు, వైద్య సిబ్బంది జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరాకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆసుపత్రికి చెందిన ఎలక్ట్రిషియన్ వారానికి మూడు రోజులు ఇక్కడ, మూడు రోజులు తణుకులోని ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత మూడు రోజులు ఆ ఉద్యోగి తణుకులో విధులు నిర్వహిస్తుండటంతో నరసాపురం ఏరియా ఆసుపత్రిలో ఎవరూ లేరు. అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో మరమ్మతులు చేయించారు. దీనికి విద్యుత్తుశాఖ పట్టణ ఏఈ కె. ప్రభాకరరావు సిబ్బందితో కలిసి వచ్చి సహకారం అందించారు. రాత్రి 10 గంటల వరకూ విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరగలేదు. సెల్ ఫోన్ల వెలుగులో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చారు.
ఆసుపత్రిలో ఏడుగురు బాలింతలు, వారి చిన్నారులు, మరో పదమూడు మంది ఇన్ఫెషెంట్లు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఫ్యాన్లు తిరగక పోవడంతో వీరిపైకి దోమలు దండెత్తాయి. ఆసుపత్రిలో వారు, వారి సహాయకులు, ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన వైద్య సిబ్బంది ఓ వైపు ఉక్కబోత, మరోవైపు దోమలతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోజుల వయస్సున్న చిన్నారులు విలవిలాడటంతో వారి మాతృమూర్తులు విలవిల్లాడారు.