Power Holiday For Industries: 'విద్యుత్ కోతలు ఎత్తివేయాలి'.. ప్రభుత్వ నిబంధనలపై పారిశ్రామిక వర్గాల ఆందోళన - విద్యుత్ భారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 7:18 PM IST
Power Holiday For Industries in AP: పవర్ హాలిడే రెండు వారాల పాటు అమలు చేయాలని పరిశ్రమలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విధించిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీ మీద విధించిన విద్యుత్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు 70 శాతం మాత్రమే విద్యుత్ వినియోగించాలని ప్రభుత్వం పెట్టిన షరతును వ్యతిరేకిస్తున్నట్లు పరిశ్రమల ప్రతినిధులు తెలిపారు.
ఇలాగైతే పరిశ్రమల మనుగడ కష్టమే.. 'ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకే పని చేయాలని,.. వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలనడం.. ఆదివారం మినహా కేవలం ఐదు రోజులు మాత్రమే పరిశ్రమలు నడుపుకోవాలని ప్రభుత్వం షరతులు పెడుతోంది. దీంతో విద్యుత్ ఆదారంగా నడిచే పరిశ్రమలు మూతపడి ప్రత్యక్షంగా పరోక్షంగా వేల కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకున్న యంత్రాలు మూలకు పెట్టాల్సిన దుస్థితి ఎదురవుతోంది' అని విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాదరావు, మాధవరావు, శేషగిరిరావు తెలిపారు.