Deadbody in Rickshaw: 'అమ్మ'కెంత కష్టమొచ్చింది.. రిక్షాలో కుమారుడి మృతదేహం తరలింపు - పార్వతీపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
poor mother carried her son deadbody in rickshaw: చేతికి అందొచ్చిన కుమారుడు మరణించినా కొండంత బాధను దిగమింగుతున్న ఆమెకు.. పేదరికం మరో పరీక్ష పెట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కుమారుడి మృతదేహాన్ని.. రిక్షాలో తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ హృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని ఆ నిరుపేద తల్లి.. రిక్షాలో ఇంటికి తీసుకు వచ్చింది. జిల్లా కేంద్రంలోని సోని వైకేయం కాలనీకి చెందిన కిషోర్(26) అనే యువకుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ లేకపోవటం, వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో.. అతడి తల్లి రిక్షాను ఆశ్రయించింది. కుమారుడి మృతదేహంతో ఆమె రిక్షాలో వెళ్తున్న దృశ్యం చూపరుల హృదయాలను కలిచివేసింది. ఈ క్రమంలో బంధువుల సహాయంతో ఆమె.. కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.